Friday, September 05, 2014

బొజ్జోరా చిట్టి తండ్రి! బొజ్జోవే చిట్టి తల్లి!


బొజ్జోరా చిట్టి తండ్రి బొజ్జోరా
బొజ్జుంటే నీకు కలలు వస్తాయి
కలలోన నీకు అమ్మ వస్తుంది
అమ్మేమొ తియ్యటి పాట పాడుతుంది

బొజ్జోవే చిట్టి తల్లి బొజ్జోవే
బొజ్జుంటే నీకు కలలు వస్తాయి
కలలోన నీకు అమ్మమ్మ వస్తుంది
అమ్మమ్మేమొ తియ్యటి లడ్డు తెస్తుంది

బొజ్జోరా చిట్టి తండ్రి బొజ్జోరా
బొజ్జుంటే నీకు కలలు వస్తాయి
కలలోన నీకు తాతయ్య వస్తారు
తాతయ్యేమొ కమ్మని కథలు చెప్తారు

బొజ్జోవే చిట్టి తల్లి బొజ్జోవే
బొజ్జుంటే నీకు కలలు వస్తాయి
కలలోన నీకు మామయ్య వస్తారు
మామయ్యేమొ బోలెడు బొమ్మలు తెస్తారు

బొజ్జోరా చిట్టి తండ్రి బొజ్జోరా
బొజ్జోవే చిట్టి తల్లి బొజ్జోవే
బొజ్జుంటే నీకు కలలు వస్తాయి!

-సౌజన్య

Tuesday, May 13, 2014

వర్షం


varsham













నల్లని మబ్బులు కమ్మిన వేళ
వర్షపు జల్లులు కురిసిన వేళ
మది పులకరిస్తుంది, మరి నిన్ను తలుస్తుంది

చల్లని గాలులు వీచిన వేళ
పచ్చని పైరులు ఊగిన వేళ
మది పులకరిస్తుంది, మరి నిన్ను తలుస్తుంది

మల్లెలు చెట్టుకి పూచిన వేళ
వెన్నెల కాంతులు విరిసిన వేళ
మది పులకరిస్తుంది, మరి నిన్ను పిలుస్తుంది


-సౌజన్య

Tuesday, May 22, 2007

పెళ్ళి





















జీవితాంతం కలసి బ్రతకాల్సిన జీవిత భాగస్వామి కోసం
ఎదురు చూసిన రెండు మనసులు పెళ్ళి పేరు తో ఒక్కటయ్యి
అప్పటి వరకు రెండు దారుల్లో వెళ్తున్న రెండు చక్రాలను ఒక బండికి కట్టినట్లు
ఇరువురు ఒక్కరై చేతిలో చేయి వేసుకొని ఒకే బాటలో నడుస్తూ
ప్రేమను పంచుకుంటూ ఒకరినొకరు అర్ధం చేసుకొంటూ
నవరసాలను చవి చూసుకుంటూ అప్పుడప్పుడు తిట్టుకుంటూ
కొంతసేపు అలుగుతూ మరి కొంతసేపు లాలించుకుంటూ
మరియు వాదించుకుంటూ వెంటనే సర్దుకుపోతూ
రోజు రోజుకీ ప్రేమని పెంచుకుంటూ బాధలను పంచుకుంటూ
ప్రతి క్షణమూ నీవు లేని నేను లేను అనే భావము తో
తమ కలలను నిజం చేసికొనుటకు కలసి మెలసి అలసి సొలసి
కష్టపడుతూ సుఖసంతోషాలతో కాలము గడపుతూ
తమ ప్రేమకు ప్రతిబింబాలైన పిల్లలకు జీవం పోసి
అప్పటి నుండి పిల్లలతో సరికొత్త జీవితాన్ని చవి చూస్తూ
వారి కోసం కష్టపడుతూ వారిని పెంచి పెద్ద వారిని చేసి
వారికి కూడ పెళ్ళి చేసి మరల నాకు నువ్వు నీకు నేనుగా
మిగిలి శేష జీవితాన్ని ప్రేమతో విశ్రాంతి తో గడిపేయగలిగే
ఆనందమయ జీవితాన్ని ప్రసాదించే అమోఘమైన బంధం
మూడు ముళ్ళతో ఏడు అడుగులతో మొదలయ్యే జీవితకాల సంబంధమే పెళ్ళంటే....


-సౌజన్య

Wednesday, December 06, 2006

వలపు తెలుపు


ఎగసేటి అలకు లేనే లేదు అలుపు
సుదూర సాగర తీరం చేరే వరకు
నిదురించిన సూర్యునికి లేనే లేదు మరపు
రేపటి ఉదయాన వెలుగు కిరణం పంచే వరకు
ఆగదు గగనం లో మిల మిల మెరిసే మెరుపు
ఆ నీలి మేఘాలు వర్షించు వరకు
తీయటి రాగ కోకిల పాడనే పాడదు
వినిపించనిదే వసంతం పిలుపు
నీకై పరితపించే నా మదిలో నీ తలపు
నశించదు నాలో ప్రాణం ఉన్నంత వరకు
నాపై నీకున్న వలపు ఇకనైనా నా మదికి తెలుపు
అప్పుడే నా ప్రేమకి నిజమైన గెలుపు
సౌజన్య

Tuesday, December 05, 2006

ప్రేమ = త్యాగం


స్వచ్ఛమైన ప్రేమ కోరుకుంటుంది త్యాగం
ఇది కాదంటే ఉంది నీ ప్రేమలో ఏదో లోపం
ఎల్లప్పుడూ కోరుకోవాలి ప్రేమించిన వారి సుఖం
వారు నీకు దక్కలేదని పగ సాధిస్తే అది ఘోరం
అప్పుడు నీది ప్రేమ కానే కాదు అది స్వార్ధం
నిజమైన ప్రేమకి కావాలి ప్రేమించినవారి సంతోషం
స్వచ్ఛమైన ప్రేమ కోరుకుంటుంది త్యాగం
ఇది తెలుసుకొని గెలుచుకో నీ ప్రేమని నేస్తం

సౌజన్య

Wednesday, November 29, 2006

కన్నీరు


పరుగు చూపించేది సెలయేరు
తేనె లొలికించేది తేనీరు
సుగంధం చిలికించేది పన్నీరు
ప్రాణం తో ఆడుకునేది గన్నేరు
బాధ ని బయట పెట్టేది కన్నీరు..

సౌజన్య

తెలియని భావం


నోటి తో చెప్పలేని దాన్ని కళ్ళతో చెబుతుంటే
కళ్ళతో చూడలేని దాన్ని కలలలో చూస్తుంటే
కాళ్ళతో నడవలేని దూరం ఊహలలో నడిచేస్తే
స్పర్శ తో స్పందించలేనిది ఆప్యాయత తో స్పందిస్తే
ఏమి జరగకుండానే పెదవులు ముసి ముసి గా నవ్వుతుంటే
మనసు తో చూస్తుంటే, మనసు తో మాట్లాడితే
మనసు తో ప్రయాణిస్తే, మనసు తో స్పందిస్తే
ఇక సందేహం ఎందుకు నీలో కలిగిన భావం ప్రేమే

సౌజన్య

ఎవ్వరివో నీవు ఎవ్వరివో



ఎవ్వరివో నీవు ఎవ్వరివో
ప్రశాంత గగనం లో మెరుపు లా
నిలిచి ఉన్న కొలనులో తరంగం లా
నిశ్శబ్దమైన లోయ లో పిడుగు లా
చిక్కటి చిట్టడవి లో వెలుగు కిరణం లా
వేడి సెగల ఎడారిని చల్లపరిచే వర్షపు చినుకు లా
నాకు ఎదురయ్యి,
నిర్జీవమైన నాలో జీవం పొసి
నిరర్ధకం అనుకున్న నా జీవితానికి అర్ధం చూపించి
నిర్వ్యామోహురాలైన నాకు వ్యామోహం పెంచి
ఆలించి, లాలించి, పాలించి,
కోపించి, ద్వేషించి, ప్రేమించి...
ప్రకృతి లోని నవరసాలను చవి చూపించి
ఇప్పుడు ఇలా నడి సముద్రం లో వదిలేసి వెళ్ళిన నీవు
ఎవ్వరివో నీవు ఎవ్వరివో

సౌజన్య

చిరు గాలి


మెల్లగ వీచే ఓ చల్లని చిరు గాలి
నీవైనా చెప్పవే ఎవ్వరో నా సరి జోడి
కలిసే ఉంటావు నీవు వారిని
తనకి చెప్పొచ్చు గా నను కలువమని
అతనెవరో నాకు తెలియదు కాని
ప్రతి క్షణం తన ఆలోచనలతో నిండింది నా మది
ఓ చల్లని చిరుగాలి నీవే చెప్పాలి అతని ఆచూకీ

సౌజన్య

ప్రియమైన శ్రీవారికి...


తలచాను నీగూర్చి కలలో
వలచాను నిను చూసి ఇలలో
పదిల పరిచాను నిన్ను నా మది లో
తెలియ పరిచాను నా ప్రేమను నీ చెవిలో
ఆహ్వనించాను నిన్ను నా జీవిత పయనం లో
నడిచాను ఏడడుగులు నీతో పెళ్ళి పందిరి లో
కలిపాను నా చేయి నీ చేతి లో
తడిచిపోయాను నీ ప్రేమ వర్షపు జల్లుల లో
కరిగిపోయాను నీ వెచ్చని ఓదార్పు లో
అర్పించుకున్నాను నా సర్వం నీ చల్లని నీడలో
అలిగాను నీపై నీవు కోపం చూపిన వేళలో
బాధ పడ్డాను నీ సాన్నిహిత్యం లేని తరుణం లో
ఎదురు చూశాను నీ ప్రేమకై వెన్నెలలో
చిందించాను ఆనందభాష్పాలు నీవు నను తిరిగి చేరిన వేళలో
మైమరిచాను నీవు నన్ను ప్రేమించే తీరు లో
ప్రేమించాను నిన్నే మనస్పూర్తిగా నా హృదయ అంతరంగం లో
కోరుకుంటాను దేవుడిని నిన్నే నాకు భర్త గా ఇమ్మని ప్రతి జన్మ లో

సౌజన్య